సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
"సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి.
ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును..
సామెతల వినియోగం సందర్భానుసారంగా వివిధ ఫలితాలనిస్తుంది. ఒకోమారు కటువైన విషయాన్ని సామెతల ద్వారా మెత్తగా చెప్పవచ్చును. ఒకోమారు ఒక వ్యక్తి తన బలహీనమైన వాదానికి తరతరాల అనుభవాన్ని జోడించిన బలం పొందగలుగుతాడు. ఒకోమారు సంభాషణకు కాస్త చైతన్యం లభిస్తుంది. ఉపన్యాసకులు సామెతల ద్వారా తమ ప్రసంగాన్ని రక్తికట్టించగలుగుతారు. సామెతల అధ్యయనం అనేక ప్రయోజనాలకు వాడుతారు - జానపద సాహిత్యం అధ్యయనం చేసేవారికి ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. ప్రజల నాగరికతలో వచ్చిన మార్పులు, వలస వెళ్ళినవారు క్రొత్త సమాజంలో ఇమిడిన తీరు, ప్రకటనలలో ఆకర్షణ, పాఠ్యాంశాల బోధనలో మెళకువలు - ఇలా అనేక ప్రయోజనాలున్నాయి.