తెలుగు భాష ప్రస్తావన రాగానే ప్రపంచవ్యాప్తంగా పలికే పదం "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' అని. 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో కొంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్(ప్రాచ్య ఇటాలియన్)గా అభివర్ణించాడు
ఇటాలియన్తో సారూప్యం:
15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో కొంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్(ప్రాచ్య ఇటాలియన్)గా అభివర్ణించాడు. నిజానికి అతను పలికిన లోకోత్తర ప్రాచుర్యం పొందిన తెలుగు ఘనతలలో ఒకటైన ఈ పదం విశిష్టత ఏమిటి? ఈ పోలికలో హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష, తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యం. ఇటాలియన్ భాషలో ప్రతి పదం పలికేటప్పుడు చివరలో "ఒక అచ్చు''ను ఉచ్ఛరిస్తారు. అదే విధానం తెలుగుకూ ఉండటంతో తెలుగు "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' అయ్యింది. ప్రతి పదం అచ్చు స్వరంతో అంతమవడాన్ని "అజంతం'' అంటారు. ఆ అందం నిలువెల్లా చిందే అపార మందకినిలాంటి భాష మన తెలుగు.
రాయల తెలుగు భాషామమకారం
తెలుగు భాషా ప్రియత్వాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు పదే పదే గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు ప్రస్తావించిన "దేశభాషలందు తెలుగు లెస్స'' అనే సుధాభరిత వ్యాఖ్య. ఆముక్త మాల్యదను తెలుగులో లిఖించే సమయాన రాయలు ఈ పద్యాన్ని ఉటంకించాడని చరిత్రకారుల వచనం. ఎంతో భావోద్వేగంతో రాయలు పలికిన పద్యాన్ని చూడండి. తెలుగుదనం మూర్తీభవించిన ఈ వాక్యాలు వింటే తనువు పులకరించక మానదు.
"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులుగొలువ నెరుగ వే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స "
తాను తెలుగు వల్లభుడను కాబట్టి తెలుగుజాతి గర్వించేలా తెలుగులోనే రాయదల్చుకున్నానని రాయలు ఈ పద్యంతో పలికిన విధం లెస్సగా ఉంటుంది.
ఆధునిక కవితా మకరందం
ఇక, ఆధునిక కవితాధారలను వెలయించిన కవులను స్మరించుకుంటే ఎద ఆనంద పరిష్వంగంతో ఓలలాడుతుంది. మల్లెపూలు, వసంతమాసం ఈ రెంటికీ విడదీయరాని బంధం, అనుబంధం ఉన్నాయి. ఈ రెంటితో పొత్తు కుదిరిన భావ కవితామూర్తి కృష్ణశాస్త్రి. ఎంతో మనోహరంగా ఉంటాయి ఆ భావకవి రచనలు. ప్రకృతి సోయగాన్ని తీయన తెలుగు పదాలతో అందించిన సుకృతి ఆయనది.
ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల బడిపోవు విరికన్నె వలపు వోలె తీయని మల్లె పూదేనె సోనల పైని తూగాడు తలిరాకు దోనెవోలె ..
అంటూ మనోహరంగా పల్లవిస్తాడు. కృష్ణశాస్త్రి మనోహరంగా సృజించిన కృష్ణపక్షాన్ని, ఊర్వశిని తెలుగు సాహితీ లోకం ఎప్పటికీ మరువలేదు. "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము'' వంటి దేశభక్తి ప్రపూరితమైన రాయప్రోలు సుబ్బారావు కవితలు చిరస్మరణీయాలే కదా! ఇక లేత మొక్కజొన్న కంకిలా తెలుగు సాహితిలో ప్రశస్తమైనది నండూరివారి "ఎంకి''.