ఈ పరిచయం శ్రీపాద వారి “అనుభవాలూ జ్ఞాపకాలూనూ” గురించి. ఇంట్లో చిన్నప్పటి నుంచి శ్రీపాద వారి చిన్నకథల పుస్తకాలున్నా కూడా ఎప్పుడు చదివిన పాపాన పోలేదు .
తర్వాత ఆ మధ్యన మా అక్క ఈ పుస్తకం బాగుందని చెప్పినా కూడా కుదరలేదు. అటు తర్వాత ఎపుడో ఒక సారి ఒక మిత్రునితో చర్చలో జరుక్ శాస్త్రి గారు ఈ పుస్తకం గురించి అన్న మాటల గురించి ప్రస్తావించటం జరిగింది. ఆ మాటలలో ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని విశ్వనాథ, చలం గార్లతో పాటు లెక్క కట్టి కొన్ని మంచి మాటలు రాసారు. తక్కిన ఇద్దరివి కాస్తో కూస్తో చదివాను కాబట్టి ఇక శ్రీపాద వారి పుస్తకం కూడా చదవాలి అని అనుకున్నాను. అయినా కుదరలేదు. అటు తర్వాత మళ్ళీ ఎప్పుడో డి. వెంకట్ రావు గారు రాసిన “ప్రియ శత్రువు” (Ashis Nandy రాసిన Initimate enemy యొక్క తెలుగు అనువాదం) తాలూకా ముందు మాటలో ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ “వారి అనుభవాలూ జ్ఞాపకాలు నిజానికి వలసతత్వంపై తెలుగులో వచ్చిన అతి గొప్ప నిశిత విమర్శయే కాక సాహిత్య వాజ్ఞ్మయ తత్త్వ మూలాలని భారత జాతుల భాషల సంస్కృ తుల్లోంచి (సంగీతం గురించి వారి యోచనలు చూడండి) గ్రహించడానికి సాహిత్య రచన ఏం సాధించగలుగుతుందని సూచించిన సూత్రీకరించిన గొప్ప తాత్త్విక ద్రష్ట రచన – మార్గదర్శకపు వాఙ్మయం” అని అన్నారు . ఒక పుస్తకం గురించి ఇన్నాళ్ళుగా ఇన్నిసార్లు విన్నాక కూడా చదవలేదు అంటే ఆత్మారాముడు ఒప్పుకోడు కనుక కొన్ని నెలల క్రితం పుస్తకం చదవటం పూర్తి అయింది. శ్రద్ధగా చదివితే మనలో ఎన్నో సంచలనాలు కలిగించగల పుస్తకం ఇది. ఫెరోజ్ గాంధీ ఏదో లోక్ సభ స్పీచు లో అనట్టు “Mutinies in mind” కలిగించే శక్తి ఉన్న పుస్తకం ఇది. జరుక్ శాస్త్రి గారు ఈ పుస్తకం పైన అయన రాసిన వ్యాసం లో “భావ సంఘర్షణ , ఆచార సంఘర్షణ , ఆచరణ సంఘర్షణ” అని మూడు పదాలు వాడారు . ఆ మాటలు వాడే అర్హత నాకు లేదు కానీ అదేదో సినిమాలో ఒక పాత్ర “మా టెన్షన్ లు మావండీ” అని అంటుంది. అలాగే “మా సంఘర్షణలు మావండీ ” అని అంటాను నేను. అలాంటి సంఘర్షణలు ఉన్న తెలుగు వారందరూ చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది ఒక మహావ్యక్తి జీవిత గాథ . దీని గురించి కొన్ని పదాలలో నేను ఏదో రాసి దాన్ని మీరు చదివేసి చప్పట్లు కొట్టేయటానికి ఏమి ఉండదు . పూర్తిగా చదవాల్సిందే . అయితే కొన్ని కొన్ని విషయాలు అలా మనకు గుర్తు ఉండి పోతాయి ఇలాంటి పుస్తకం చదివాక. ఆ విషయాల గురించే ఈ పరిచయం. నాలో చిన్న చిన్న విస్ఫోటనలు కలిగించిన కొన్ని విషయాల గురించి ఈ వ్యాసం .
వారి కుల విద్యలు , బాల్యం చదువులు వగైరాల గురించి చెప్పినప్పుడు నాకు చాలా alien పదాలు పద ప్రయోగాలూ తారస పడ్డాయి . ఆ పదాలు ఆ విద్యల తాలూకా విషయాలు ఇపుడు నాకు కొత్తగా విజాతీయంగా అనిపించటం నా దురదృష్టం అని అనుకుంటాను . నూతన్ ప్రసాద్ ఏదో సినిమాలో అనట్టు “అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంది” కాబట్టి నా లాంటి వాడికి ఇవన్ని కొత్తగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు అని సమాధాన పరుచుకున్నాను . మీ నాన్న లేదా అమ్మ ఏం చేస్తారు అని ఎవరినైనా అడిగితే “ఇన్ఫోసిస్ లో పని చేస్తారు అనో లేక డాక్టరనో లేక బిజినేస్స్మన్ అనో ఆటో డ్రైవర్ అనో చెప్పుకుంటాం” ఈ కాలంలో. ఏం చదువుకున్నారు అంటే “బీ టెక్కో ఎం టెక్కో ఇంకేదో చెప్పుకుంటాం”. ఈయనేమో “వేదము శ్రౌతము స్మార్తము జ్యోతిశ్శాస్త్రం వగైరాలు కుల విద్యలనీ” అనీ .. “మా నాయనగారు స్మార్తంలో రెండో అపస్తంబులనీ .. మంత్ర శాస్త్రంలో పాదుకాంత దీక్షా పరులనీ .. ” మొదలు పెడతారు . ఇంతలోనే ఎంత మార్పు అన్నట్టు మన చదువులు విద్యలు ఉద్యోగాలు ఏ స్థాయిలో మారిపోయాయో! నాకసలు సగం పదాలకి అర్థమే తెలీదు ఆయన చెప్పిన చదువులలో! ఇది ఈయన కులం గురించి మాత్రమేనూ! అన్ని కులవిద్యలనూ అన్ని చదువులనూ వాటి తాలూకా స్పెషలైజేషన్ లనూ తెచ్చి లెక్క గడితే తెలుస్తుంది అనుకుంట మనకి అప్పటి చదువుల విస్తృతి!