వీరి దక్ష్షారామం-ఇతరకృతులలో కొన్ని కవితలను చదువుతూ ఉంటే పాఠకులకు ఆయనకు సమకాలికులైన ఇతర కవుల రచనలు తప్పక స్ఫురిస్తాయి. అవి అంధానుకరణలు కావు- ఆ రచనల స్ఫూర్తితో ఇంద్రగంటి వారు తమ కవితామూర్తిని దీప్తిమంతం చేసుకున్నారు. మచ్చునకు కొన్ని ఉదాహరణలు :
ఇంద్రగంటి వారు ''జీవితకావ్యం'' అన్న కవితా ఖండికలో ''అసలు నాకీ ప్రపంచమే అర్థహీన/గూఢమూఢకావ్యమ్ముగా గోచరించు విషపునవ్వులు కంటక వీక్షణములు/ప్రతిపరిచ్చేదమున అడ్డుపడను'' నాకు. (ద్రక్షరామం-ఇతర కృతులు-పుట-115) అని ఒకదశలో తెలుపుకున్నారు. దీనిని చదివిన వెంటనే పఠితలకు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షంలోని ''నా జీవితము''అన్న ఖండికలోని ''వితంగాతోచునాదు జీవితమునాకె/జిలుగు వెన్నెలతో చిమ్మచీకటులతో అమల మోహన సంగీతమందు హృదయ/దళనదారుణరోదనధ్వనుల విందు'' (కృష్ణపక్షం-పుట-9) అన్న పద్యం స్ఫురిస్తుంది. పై రెండు పద్యాల్లోనూ జీవితంలో హఠాత్తుగా సంభవించే వెలుగు నీడలొక చోట చేర్చబడ్డాయి-ఈ భావభావనకు ఫలం నైరాశ్యప్రకటన. ఇంద్రగంటి వారి ''మేలు కొలుపు''అన్న ఖండికలో 'ఇతడు మా రైతు తానెండవానల మ్రగ్గి/ఎవరికోసర మొపండించిపోయు ఇతడు మా కూలి తానెవరికో సౌధమ్ము/నిలుపబండలనెత్తినలిగిపోవు ఇతడు మా కార్మికుండెవరి నిమిత్తమో/ కాలా యసంబుపెకల్చి ఆర్చు ఇతడు మా జాతీయ హితుడేరికొరకునో/చెఱసాలలోనె కాపురము పెట్టె కంటతడితోడ గర్వరేఖల వెలార్చి/ ఆపరార్థజీవనుల మహత్వగాధ కింతనీ యమృతస్పర్శ మిచ్చినేడు/ కావ్యమల్లుములేఖనీ! కదలినీవు'' (దక్షారమం-ఇతరకృతులు పుట-92) అన్న పద్యం ఉంది. ఈ పద్యం శ్రీశ్రీ మహాప్రస్థానంలో ''దేశ చరిత్రలు'' అన్న కవితాఖండిక లోని ఇతిహాసపు చీకటికోణం./ అట్టడుగున పడి కన్పించని /కథలన్నీ కావాలిప్పుడు/ దాచేస్తే దాగని సత్యం/ నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?/ తాజ్మహల్ నిర్మాణానికి/రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? (మహాప్రస్థానసంపుటి-72) అన్న యుగలక్షణ ప్రభావాన్ని పుణికి పుచ్చుకుంది. అసలు ''పగుల దన్నుము వజ్రాకవాటములను/ ఆవులించి గాండ్రించు సింహాలనదిమి బొబ్బ లెత్తింపుకృతసటాస్పోటనముల/ యువక! నీస్నిగ్థ హృదయమ్ముడిఉడి నేని''(దక్షారామం-ఇతర కృతులు-పుట-143) అన్న ఇంద్రగంటి వారి తేటగీతి పద్యంలో అక్షరాక్షరంలోనూ శ్రీశ్రీ విప్లవ స్ఫూర్తి ద్యోతకమౌతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంలో ఇంద్రగంటి వారు రచించిన ''మహాంధ్ర'' కవితాఖండికలోని ''వితత భాగ్యపురాన విసరిన బావుటా/ విజయవాటిని వెల్గువిప్పినపుడి అమరావతీశిల్ప మల అజంతా రేఖ/ హృదయమ్ము కలిపి వర్తించునపుడు నాగార్జునా చలసాగరమ్మటు పొంగి/ తెలంగాణమున పైడి దులిపినపుడు తీరాంధ్ర సుకవితా ధీరవాణులు భాగ్య/పురవీణలందు మార్మ్రోగునపుడు తేరిచూడంగరాని అదృష్టదీప్తి/నేలనాలుగు చెరగులు నేల గలరు చెలిమి బలిమిని కలిమిని తెలివిగలిగి/ వెలుగు వారే కమతులైన (తెలుగువారు-ద్రక్షరామం-ఇతర కృతులు-పుట 129) అన్న పద్యం రాయప్రోలు సుబ్బారావుగారి '' అమారవతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు (ఆంధ్రావళి- పుట-19) అన్న పద్యాన్ని స్ఫురింపజేస్తోంది. పై రెండు పద్యాలలోనూ ఆంధ్రదేశానికి చెందిన గతకాల వైభవప్రశస్తి ఒళ్ళు గగుర్పొడి చేటట్లుగా కావింపబడింది. ఆ గగుర్పాటు ఇంద్రగంటి వారి పద్యంలో కొంచెం తగ్గినా- ఆ భావప్రభావ దీప్తి మాత్రం ఏమీ తక్కువ కాదు-
'' ఈ తనువెన్నిజన్మముల నెత్తినదో-విపులాంధ్రమేదినీ
మాతృపవిత్ర గర్భమున-మానసవీధిని తల్లివైభవ
శ్రీతలప గమేన్పుల కరించును-మద్గళమందపూర్వసం
గీతములుప్పతల్లి తొనకించుసుధల్ మధురానులాపమై||
(దక్షారామం-ఇతర కృతులు-పుట-3) ఇది ఇంద్రగంటివారి ''దక్షారామ'' కావ్యం లోని పద్యం.
''ఇమ్ముగకాకుళమ్ము మొదలీవరకుంగల యాంధ్రపూర్వరా
జ్యమ్ములపేరు చెప్పిన హృదంతర మేలొ చలించిపోవునా
ర్థ్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని ఎన్నిజన్మమ్మలుగాగ నీతనువునన్ ప్రవహించునో ఆంధ్రరక్తముల్
ఇది విశ్వనాథవారి ''ఆంధ్రప్రశస్తి''కావ్యంలోని పద్యం.
ఇంద్రగంటి వారికి మేనుపులకరిస్తే, విశ్వనాధవారికి హృదంతరం చలించి పోతుందట. తమ హృదంతరం చలించిపోవడానికి గల కారణాన్ని పద్యం ముగింపులో విశ్వనాధవారు సృష్టంగా వ్యక్తీకరిస్తే ఇంద్రగంటి వారు తమ అనుభూతినే ఇంకా భావకవితాధోరణిలో వ్యక్తీకరించారు- చలించిపోతుం దంట. 'మద్గమందపూర్వ సంగీతములుప్పతిల్లి'' అనడంలో సంగీతం అనేది మనపూర్వ సంస్కృతికి చిహ్నమనీ'' సుధల్ తొనకడం'' సంతోషానుభూతి వ్యక్తీకరణకి తార్కాణమనీ భావించవచ్చు. ఇది వినూత్నమైన భావకవుల నవ్యభావ చిత్రణకు తార్కాణం.
''పులినోటికండ చేతుల పెకల్చెడు తెల్గువీరుల పెనుకత్తి విసరు లెరిగి బారుటీటెలత్రిప్పిపగఱనెత్తురుతేనె| త్రాగించు ఒడికంపు రవణ నేర్చి...''(కీర్తితోరణం-పుట 81)
ఇత్యాదిగా ఇంద్రగంటి వారి కీర్తి తోరణం పద్యకావ్యంలోని ప్రతాపరుద్రుని విద్యాభ్యాస వర్ణన పద్యం చదివే పాఠకులకు గడియారం వెంకటశేషశాస్త్రి గారి ''శ్రీ శివభారతం'' పద్యకావ్యంలోని శివాజీ విద్యాభ్యాసాన్ని వర్ణించే ''ఆవులించిన మాత్ర ప్రేవులెంచగనేర్చి/ నీటిలోజాడలు నెమకనేర్చి పాలు నీరును వేరుపరచునాణెమునేర్చి/ కనుపాపనీడల గాంచనేర్చి-''( 2 అశ్వాసం- 217పద్యం) ఇత్యాదిగా సాగినపద్యం స్ఫురణకు రాకమానదు.
ఇంద్రగంటి వారి ''జీవితకావ్యం''అన్న ఖండికలోని.... నడువలేక నడువలేక నడచివచ్చు/మానవులనాదరించెడి మసనముందు..విశ్రమించిన శాంతిదేవే! నమామి(దక్షారామం ఇతర కృతులు పుట-112) అన్న పద్యగత భావనలో గుఱ్ఱం జాషువా గారి ''స్మశానము''ను కవితాఖండికలోని, ఇటనస్పృశ్యత సంచరించుటకు తావేలేదు....(ఖండకావ్యం-ప్రథమభాగం) అన్న పద్యగత భావం స్ఫురణకు వస్తుంది. ఇటువంటి కవితాస్ఫూర్తులతో మూర్తీభవించిన వారు కాబట్టే ఆంధ్రసాహిత్యపరంగా-అలీనోద్యమవాది ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు-అని చెప్పవచ్చు.
-డా||రామడుగు వెంకటేశ్వరశర్మ
http://54.243.62.7/literature/article-43595