టంగుటూరి ప్రకాశం పంతులు (జ.ఆగష్టు 23, 1872 – మ.మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి.
నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
బాల్యం
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తి లో ఉండేవారు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజం లో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.
చదువు
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపదా సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.